Telugu translation of 'The Book of Life'
Jeevithame Oka Pustakam (The Book of Life)
మానవ జాతి చరిత్ర అంతా మీలోనే ఉంది. అసంఖ్యాకమైన అనుభవాలు, లోలోపల లోతుగా వేళ్ళూనుకొనిపోయిన భయాలు, ఆందోళనలు, దుఃఖాలు, సుఖాలు, వేల వేల ఏళ్ళుగా మనిషి కూడబెట్టుకొని దాచుకున్న నమ్మకాలు - అన్నీ మీ లోపలే ఉన్నాయి. ఆ చరిత్ర అంతా ఉన్న పుస్తకం మీరే.
సత్యాన్ని జీవితంలోనే కనిపెట్టాలి తప్ప ఎక్కడో జీవితానికి దూరంగా కాదు అనే కృష్ణమూర్తి దృక్పథంతో ప్రేరణ చెంది ఈ ‘జీవితమే ఒక పుస్తకం’ సమకూర్చబడింది. దీనిలో రోజు కొకటి చొప్పున ఒక సంవత్సరానికి సరిపడే 365 ఉల్లేఖనాలు
ఉన్నాయి. వీటిని కృష్ణమూర్తి రచనల నుండి, ప్రసంగాల నుండి సేకరించడం జరిగింది. కాలానికి అతీతంగా సాగే ఈ ప్రతి దిన ధ్యాన వాహినిలో ఒక్కొక్క అంశాన్ని గురించి ఏడు రోజులు నిశిత పరిశీలన జరుగుతుంది. దీని వలన మన నిత్యజీవిత సమస్యల గురించి మనకు తేటతెల్లం అవడమే కాకుండా, ఆ సమస్యలను పరిష్కరించాలి అనే మన భ్రాంతినీ, సంతోషమూ పరమానందమూ మరెక్కడో లభిస్తాయని సమస్యలను పక్కకు నెట్టి వెతుకులాడటంలో ఉన్న భ్రమనూ కూడా పటాపంచలు చేస్తాయి.
జిడ్డు కృష్ణమూర్తి (1895-1986) మహోన్నతుడైన తాత్వికవేత్తగా, ధర్మ ప్రబోధకునిగా ప్రపంచమంతటా పరిగణింపబడుతున్నారు. అరవై సంవత్సరాలకు పైగా అతడు వివిధ ఖండాలలో, దేశాలలో పర్యటించి ప్రసంగాలు ఇచ్చారు. చర్చలు, సంవాదాలలో పాల్గొన్నారు. అయితే ఒక గురువులా కాకుండా, ఒక మిత్రుడిలా ప్రజలతో సంభాషణల్లో పాల్గొన్నారు. అతడి బోధలు గ్రంధ జ్ఞానం పైన, సిద్ధాంతాల పైన ఆధారపడినవి కావు. అందుచేత, ఈ వర్తమాన ప్రపంచపు సంక్షోభాలకు, మానవ అస్తిత్వంలో గల ఈ ఎడతెగని సమస్యలకు సమాధానాల కోసం అన్వేషిస్తున్న ఎవరినైనా అతడి బోధలు సూటిగా స్పృశించి, భావ ప్రసారం చేస్తాయి.