Telugu translation of 'Think On These Things'
‘
Ee Vishayaalu Alochinchandi (Think on These Things)
‘ఈ శతాబ్దంలో వెలువడిన వంద ఉత్తమ ఆధ్యాత్మిక గ్రంథాలలో ఇది ఒకటి’ అని పెరబొలా అనే అమెరికన్ పత్రిక ఈ గ్రంథాన్ని ప్రశంసించింది. కృష్ణమూర్తి బోధలు తెలుసుకోవాలనుకునే వారు చదవవలసిన మంచి పరిచయ గ్రంథం ఇది. పిల్లలకూ, పెద్దలకూ అందరికీ కూడా. భారతదేశంలో విద్యార్థులకు, అధ్యాపకులకు, తల్లిదండ్రులకు కృష్ణమూర్తి ఇచ్చిన ప్రసంగాలు, వారితో జరిపిన చర్చలు ఈ గ్రంథంలో ఉన్నాయి. అనేక ప్రపంచ భాషలలోకి ఇది అనువాదం చేయబడింది. విద్య చేయవలసిన పని మనిషి నిర్వర్తించవలసిన కర్తవ్యమే తప్ప మానవ జీవితము, విద్యాధ్యయనమూ వేరు వేరు కావు, అవి ఒక్కటే అని కృష్ణమూర్తి ఏ సందేహాలకూ చోటివ్వని రీతిలో ఇక్కడ వివరిస్తున్నారు.
‘మంచి కోసం, సత్యం లేదా దైవం కోసం జరిపే అన్వేషణకు గాను మనిషిలో శక్తిని ఉజ్జీవింప చేయడమే విద్య నిర్వర్తించవలసిన పని. ఇది ఆ మనిషిని నిజమైన మానవీయునిగా చేస్తుంది. ఆ విధంగా అతడు సజ్జనుడైన పౌరుడవుతాడు... నది ప్రవహిస్తూనే రెండు వైపులా గట్లను నిర్మించుకున్నట్లుగానే ఈ శక్తి కూడా మరెవ్వరూ విధించకుండానే తన క్రమశిక్షణను తానే సృష్టించుకుంటుంది. నది సాగరాన్ని చేరుకున్నట్లు ఆ శక్తి తన విముక్తిని అందుకుంటుంది.’
1895లో మదనపల్లిలో జన్మించిన జిడ్డు కృష్ణమూర్తిని మహోన్నతమైన తాత్వికతను బోధించిన ఋషితుల్యునిగా ప్రపంచమంతా పరిగణిస్తున్నది. గురువులా కాకుండా ఒక స్నేహితునిలా అతడు ప్రజలనుద్దేశించి ప్రసంగించే వాడు. విద్యార్థులను, యువతీ యువకులను, పెద్దలను అందరినీ ప్రభావితం చేసిన అతడి ప్రసంగాలు జీవితం ఎడల వారిలో ప్రగాఢ స్పృహను మేల్కొల్పాయి. 1986లో తుదిశ్వాస వదిలే వరకు అవిశ్రాంతంగా పర్యటించి, మానవ చేతనలో సంపూర్ణమైన పరివర్తన కలగడం కొరకు రచనలు, ప్రసంగాలు చేసి, చర్చలు, సంవాదాలు, సంభాషణలు జరిపాడు. జీవితంలోని సౌందర్యాన్ని, సంక్లిష్టతను పరిగ్రాహ్యం చేసుకోగల నవ్యదృష్టిని ప్రసాదించిన దార్శనికుడు.